
న్యూఢిల్లీ, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం -2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై ఇప్పటికే ఎంఐఎం పలు పిటిషన్లు దాఖలు చేయగా, తాజాగా వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25, 26ను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ సవరణ ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉందని ప్రస్తావించింది.
ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం అంటే వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని పిటిషన్‌లో ప్రస్తావించినట్లు వైసీపీ అధికారిక ‘ఎక్స్’లో వెల్లడించింది. కాగా.. ఈ పిటిషన్లుబుధవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.